Saturday 17 November 2012


నవంబర్ 10 ‘మలాలా డే’
పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసుఫ్‌జై గౌరవార్థం నవంబర్ 10ని ‘మలాలా డే’గా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ప్రకటించారు. చదువు కోసం పోరాడిన మలాలా ప్రపంచంలోని బాలికలందరి విద్యాహక్కుకు ప్రతినిధిగా మారిందని కూడా మూన్ ప్రశంసించారు. బాలికల చదువు కోసం ప్రచారం చేస్తున్న మలాలాపై గత నెలలో పాకిస్థాన్‌లో తాలిబన్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం మలాలా బ్రిటన్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఫోర్బ్స్ విద్యారంగ ఇన్నోవేటర్స్‌లో భారతీయులు
వినూత్నమైన టెక్నాలజీలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న 15 మందితో ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఇద్దరు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. చౌక ట్యాబ్లెట్ పీసీలు ఆకాశ్ తయారీ సంస్థ డేటావిండ్ సీఈవో సునీత్‌సింగ్ టులి, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రొఫెసర్ అనంత్ అగర్వాల్ వీరిలో ఉన్నారు. 

అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఒబామా ఎన్నిక 
అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 6న జరిగిన ఎన్నికల్లో.. బరాక్ ఒబామా (డెమోక్రటిక్ పార్టీ) తిరిగి రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మిట్ రోమ్నీపై ఆయన విజయం సాధించారు. ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం 538 ఓట్లలో అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు కనీసం 270 ఓట్లు అవసరం. కాగా, ఒబామాకు 332, రోమ్నీకి 206 ఓట్లు లభించాయి. రెండో ప్రపంచయుద్ధం అనంతరం బిల్ క్లింటన్ తర్వాత వరుసగా రెండోసారి పదవి దక్కించుకున్న డెమోక్రటిక్ అభ్యర్థి ఒబామా.  
                  బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్ తర్వాత వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఘనతను కూడా ఒబామా దక్కించుకున్నారు. 2013 జనవరిలో రెండో విడత అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒబామా తొలిసారి 2008 నవంబర్‌లో అధ్యక్షుడి(44వ)గా ఎన్నికయ్యారు. ఆయన అసలు పేరు బరాక్ హుసేన్ ఒబామా జూనియర్. 1961 ఆగస్ట్ 4న హవాయిలోని హొనొలులులో జన్మించారు. ఆయన తల్లి అమెరికాకు చెందిన శ్వేత జాతీయురాలు ఆన్ డన్హామ్. తండ్రి కెన్యాలో జన్మించిన బరాక్ ఒబామా సీనియర్. ఒబామా 2009లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.

రిమ్ విదేశాంగ మంత్రుల సమావేశం
హిందూ మహాసముద్ర తీర ప్రాంతానికి చెందిన.. ఓసియన్ రిమ్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కో ఆపరేషన్ (ఐఓఆర్-ఎఆర్‌సి) దేశాల విదేశాంగ మంత్రుల 12వ సదస్సు న్యూఢిల్లీలో నవంబర్ 2న ముగిసింది. ఇందులో సముద్ర భద్రత మత్స్య సంపద నిర్వహణ, వాణిజ్యం, పెట్టుబడులు, విపత్తు నిర్వహణ వంటి అంశాలను చర్చించారు. అమెరికాను ఆరో చర్చల భాగస్వామిగా ఈ సమావేశంలో చేర్చుకున్నారు. చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జపాన్, యూకే దేశాలు ఇప్పటికే చర్చల భాగస్వాములుగా ఉన్నాయి. ప్రాంతీయంగా ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంపొందించేందుకు మారిషస్‌లో 1997లో ఆస్ట్రేలియా, ఇండియా, కెన్యా, ఓమన్, సింగపూర్, దక్షిణాఫ్రికా దేశాలు ఐఓఆర్-ఎఆర్‌సిగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇందులో 19 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. హిందూ మహాసముద్రం నుంచి 70 శాతం పెట్రోలియం ఉత్పత్తుల రవాణా జరుగుతుంది. ప్రపంచంలో సగం కంటైనర్ ట్రాఫిక్ ిహిందూ మహాసముద్రం ద్వారానే సాగుతుంది. 

లండన్‌లో భారత సంతతి గూఢచారి విగ్రహం
భారత సంతతికి చెందిన గూఢచారి యువరాణి నూర్ ఇన్యాత్ ఖాన్ విగ్రహాన్ని నవంబర్ 8న లండన్‌లో ఆవిష్కరించనున్నారు. ఒక ముస్లిం లేదా ఆసియాకు చెందిన ఒక మహిళకు బ్రిటన్‌లో స్మారకాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. నూర్ 1914లో మాస్కోలో జన్మించారు. అక్కడి వారి కుటుంబం లండన్‌కు చేరింది. నూర్ తండ్రి భారతీయుడు, తల్లి అమెరికన్. 1940లో ఆమె మహిళా అనుబంధ వైమానిక దళంలో చేరారు. 1942లో విన్స్‌టన్ చర్చిల్‌కు చెందిన రహస్య దళం స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. నాజీలకు రహస్యాలు వెల్లడించని కారణంగా నిర్బంధించి 1944లో దచావులోని కాన్‌సెన్ ట్రేషన్ క్యాంప్‌లో కాల్చి చంపారు. మరణానంతరం ఈమెకు జార్జి క్రాస్ పురస్కారం, ఫ్రాన్స్ ప్రభుత్వ క్రాయిక్స్ డి గ్యుర్రె అవార్డులు లభించాయి.