Thursday 11 October 2012

రసాయన శాస్త్ర విభాగంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్‌

                       
స్టాక్‌హోం: వైద్యరంగంలో తక్కువ దుష్ఫలితాలతో, మెరుగైన ఔషధాల తయారీకి తోడ్పడే పరిశోధనలు చేసిన రసాయన శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి వరించింది. అమెరికా రసాయన శాస్త్రవేత్తలు రాబర్ట్‌ లెఫ్కోవిట్జ్‌, బ్రియాన్‌ కోబిల్కాలు 2012 రసాయన శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని సాధించారు. కణ గ్రాహ్యకాల (రిసెప్టర్ల)పై చేసిన పరిశోధనలకుగాను వీరికి ఈ పురస్కారం ప్రకటించారు. పరమాణువుల స్థాయిలో శరీరం ఎలా పని చేస్తుందనే దిశగా వీరు కీలకమైన అంతరదృష్టిని సాధించారు. ఈ పురస్కారం రసాయన శాస్త్ర విభాగంలో ప్రకటించినా, వైద్యరంగానికే అతిపెద్ద ప్రయోజనమని నోబెల్‌ కమిటీ పేర్కొంది. కణాలకు సంబంధించిన కీలక భాగం..'జీ ప్రొటీన్‌ కపుల్డ్‌ రిసెప్టర్స్‌' గురించి వివరించినందుకు ఈ పురస్కారం దక్కింది. సగందాకా మందులన్నీ వాటి ప్రభావాన్ని 'జీ ప్రొటీన్‌ కపుల్డ్‌ రిసెప్టర్స్‌' ద్వారానే పొందుతాయని నోబెల్‌ జ్యూరీ వెల్లడించింది. ఈ గ్రాహ్యకాలను అవగాహన చేసుకోవడం వల్ల వైద్య పరిశోధనలకు భారీ సానుకూల ప్రయోజనం దక్కుతుందని పేర్కొంది. కమిటీ సభ్యులు స్వెన్‌ లిడిన్‌ మాట్లాడుతూ.. కణాలు ఎలా కనిపిస్తున్నాయో, అవెలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడం ద్వారా తక్కువ దుష్ఫలితాలతో మెరుగైన ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
                   విజేతల్లో ఒకరైన లెఫ్కోవిట్జ్‌ (69) ఉత్తర కరోలినా డ్యూక్‌ విశ్వవిద్యాలయంలో బయోమెడిసిన్‌, బయోకెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కోబిల్కా.. కాలిఫోర్నియా స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో మాలిక్యులర్‌, సెల్యులర్‌ ఫిజియాలజీలో ప్రొఫెసర్‌. నోబెల్‌ పురస్కార వార్తను చెప్పేందుకు ఫోన్‌ చేసినప్పుడు నిద్రలో ఉండి, ఆ శబ్దాన్ని వినలేకపోయానని లెఫ్కోవిట్జ్‌ విలేకరులతో చెప్పారు. ఫోనొచ్చింది అని తన భార్య చెబితే, అప్పుడు ఫోనెత్తి, విషయం విని దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికీ లోనయ్యాను అని పేర్కొన్నారు. డిసెంబరు 10న నిర్వహించే అధికారిక కార్యక్రమంలో విజేతలు నోబెల్‌ పురస్కారాలను అందుకుంటారు.